Breaking News

చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

2.5 తులాల బంగారు పుస్తెలతాడు స్వాధీనం.. ఇద్దరు మైనర్లు

చోరీకి ఉపయోగించిన బైక్, సెల్‌ఫోన్లు కూడా పోలీసుల స్వాధీనం

జగిత్యాల, నవంబర్ 04 (E6tv న్యూస్).

మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను కొడిమ్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఒకరు మేజర్ కాగా, మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం తండాకు చెందిన అజ్మీర దూరి (50) నవంబర్ 3న ఉదయం 9 గంటల సమయంలో సూరంపేట గ్రామ శివారులోని ఐకేపీ కేంద్రానికి వడ్లు ఆరబెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 4న నాచుపల్లి ఇటుక బట్టీల సమీపంలో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది.

నిందితుల నుంచి చోరీకి గురైన బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ బైక్ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిప్పన్నపేట గ్రామంలో చోరీకి గురైన వాహనంగా గుర్తించారు.నిందితుల్లో కోరుట్లకు చెందిన గణేష్‌తో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లు కావడంతో వారి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. అనంతరం ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *