Breaking News

భైంసాలో పదో తరగతి విద్యార్థులకు మజ్లిస్ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ల పంపిణీ

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ప్రధాన ఆయుధం – మజ్లిస్ నాయకులు

భైంసా, నవంబర్ 04 (E6 న్యూస్)

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు మెరుగైన సన్నద్ధత సాధించి, ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సాలార్ మిల్లాత్ ఆల్-ఇన్-వన్’ మోడల్ పేపర్లను పంపిణీ చేశారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు, భైంసా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జాబిర్ అహ్మద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భైంసా పట్టణంలోని మార్కెట్ ప్రాంత సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థినులకు మోడల్ పేపర్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైంసా మజ్లిస్ టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్ ఫైజుల్లా ఖాన్ హాజరై విద్యార్థినులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మోడల్ పేపర్లను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో రూపొందించిన ఈ గైడ్స్ పరీక్షల సన్నద్ధతకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.విద్య అనేది అభివృద్ధికి ప్రధాన ఆయుధమని, విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని మజ్లిస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మజ్లిస్ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.

అనంతరం పాఠశాలలో ప్రతిభ కనబరిచి పదో తరగతిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినులను సత్కరించారు. మొదటి స్థానం సాధించిన అదిబాకు రూ.5,000 నగదు బహుమతి, రెండో స్థానం సాధించిన మదిహాకు రూ.2,500 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థినులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మదర్సా సదర్ మహమ్మద్ గౌస్ సాహెబ్ మాట్లాడుతూ.. భైంసా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జాబిర్ అహ్మద్ రాజకీయ జీవితం, ప్రజాసేవను ప్రశంసించారు. దేశం, సమాజ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మజ్లిస్ టౌన్ జనరల్ సెక్రటరీ, కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ మజీద్, కౌన్సిలర్లు అబ్దుల్ ఖాదిర్ బాబా, అబ్దుల్ జావేద్, మహమ్మద్ ముజమ్మిల్, మహమ్మద్ షేక్ ఖదీర్, సయ్యద్ ఆజం, మున్సిపాలిటీ సహాయ సభ్యుడు అయూబ్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రాఫు, పాఠశాల నిర్వాహకులు, మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతలో మార్గనిర్దేశం చేయడం, వారి విద్యా ప్రతిభను మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *