Breaking News

మహిళా సంఘాల రుణాలపై ఉద్యోగి పెత్తనం!

రుణాల పేరుతో నగదు స్వాహా చేశాడని సీఏ పై ఆరోపణలు

ఫోన్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాలోకి నగదు బదిలీ చేశారని బాధితురాలి ఫిర్యాదు

డబ్బులు తిరిగి అడిగితే దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు,FIR నమోదు

నెల రోజుల క్రితమే ఏపీఎం కు ఆధారాలతో ఫిర్యాదు.. అయినా చర్యలు శూన్యం!

సిరికొండ, నవంబర్ 06 (E6tv న్యూస్: శివ ఠాకూర్)

మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ పథకాలు కొందరు ఉద్యోగుల వ్యవహారశైలితో వివాదాస్పదమవుతున్నాయనే ఆరోపణలు సిరికొండ మండలంలో కలకలం రేపుతున్నాయి. మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయించడం, రికవరీ బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగిపైనే రుణాల నగదును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది.

15 ఏళ్లుగా అదే కార్యాలయంలో విధులు..

సిరికొండ మండల సమైక్య కార్యాలయంలో సీఏ గా పనిచేస్తున్న సున్నపు బాల సాయిలు గత 15 సంవత్సరాలుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, శ్రీనిధి రుణాల ప్రక్రియ, రుణాల రికవరీ వంటి బాధ్యతలు నిర్వహిస్తున్న అతనిపై జై సంతోషిమాత మహిళా సంఘం అధ్యక్షురాలు గుర్రాల శ్యామల ఆరోపణలు చేశారు.

రూ.1లక్ష రుణం మంజూరు.. రూ.లక్ష వరకు నగదు తీసుకున్నారని ఆరోపణ!

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యులతో కూడిన జై సంతోషిమాత మహిళా సంఘానికి శ్రీనిధి పథకం కింద అధ్యక్షురాలుకు రూ.1లక్ష రుణం మంజూరైంది. ఈ క్రమంలో వడ్డీ లేని రుణం కింద వచ్చిన మరో రూ.50 వేల నగదును సీఏ బాల సాయిలు తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అదే రోజు ఫోన్‌పే ద్వారా తన వ్యక్తిగత ఖాతాలోకి నగదు బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. మరో విడతలోనూ నగదు తీసుకోవడంతో మొత్తం రూ.లక్ష యాభైవేల వరకు లావాదేవీలు జరిగినట్లు బాధితురాలు ఆధారాలతో, సిరికొండ మండల సమైక్య లో సిఎ బాలరాజుపై ఫిర్యాదు చేశారు.

రుణం మహిళ పేరు మీద.. ఇబ్బందులు సంఘానికి!

రుణం మహిళా సంఘం అధ్యక్షురాలు గుర్రాల శ్యామల పేరు మీద ఉండటంతో రుణ బకాయిల బాధ్యత ఆమెపై పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న నగదును , సి ఏ సున్నపు బాల సాయిలు కారణంగా తిరిగి చెల్లించకపోవడంతో సంఘం డిఫాల్టర్‌గా మారే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మహిళా సంఘం ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన ఈ వివాదం సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

డబ్బులు అడిగితే కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారంటూ ఆరోపణ!

తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బాల సాయిలు తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు ఎనిమిది మంది తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని గుర్రాల శ్యామల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సిరికొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు. తనను మానసికంగా వేధించడంతో పాటు, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

నెల రోజుల క్రితమే ఏపీఎంకు ఫిర్యాదు.. చర్యలు ఎక్కడ?

ఈ వ్యవహారానికి సంబంధించి ఫోన్‌పే లావాదేవీల ట్రాన్సాక్షన్ వివరాలు, దాడి ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీలను సుమారు నెల రోజుల క్రితం సిరికొండ ఏపీఎం సువర్ణకు అందించినట్లు బాధితురాలు వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత ఉద్యోగిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు విచారణ చేపట్టారా? బాధితురాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించారా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి!

మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ఇదే తరహా వ్యవహారాలు మండలంలోని ఇతర గ్రామ సంఘాల్లోనూ జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు మండల కేంద్రంలో న్యాయం జరగకపోతే, రాబోయే కాలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను కలిసి తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలను, జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ ఐకెపి నిజామాబాద్ ప్రాజెక్టు డైరెక్టర్ కి సమర్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితురాలు కోరుతున్నారు. ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించి, పోలీస్ కేసు వివరాలను పరిగణనలోకి తీసుకుని, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా సంఘాల రుణాల నిర్వహణలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మహిళా సంఘాల రుణాలకు భద్రత లేదా? బాధితురాలి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఆరోపణలపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *