Breaking News

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి

పనుల వేగం పెంచాలి.. అధికారులకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచన

22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ

ఇందూరు, నవంబర్ 05 (E6tv న్యూస్).

నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. నగరంలోని 22, 25, 35వ డివిజన్ల పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిధులతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని డివిజన్లలో రూ.కోటి విలువైన అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

యూజీడీ పనుల్లో వేగం పెంచాలి

అమృత్ 2.0 పథకం కింద నగరంలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

నీటిని పొదుపుగా వినియోగించాలి

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఖిల్లా రామాలయానికి రోప్‌వే

ఇందూరుకు చారిత్రక గుర్తింపుగా నిలిచిన పురాతన ఖిల్లా రామాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయానికి రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ముందుకు సాగుతోందని, ఇటీవల దీనికి సంబంధించి అధికారులు, కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా, 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు పవన్ ముందడ, శ్రీనివాస్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *