జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్ నియామకం
నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు చలకని వెంకట్ యాదవ్
రాష్ట్ర రాజధానిలో హాస్టల్ భవన నిర్మాణానికి రూ.లక్ష విరాళం ప్రకటన
నిజామాబాద్, నవంబర్ 05 (E6tv న్యూస్: శివ ఠాకూర్)
యాదవ సమాజ అభ్యున్నతి, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా విద్యావంతుల ఐక్య వేదికను ఏర్పాటు చేసినట్లు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకని వెంకట్ యాదవ్ తెలిపారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దండేమేని మంజుల యాదవ్‌ను నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
విద్యతోనే సమాజ అభివృద్ధి..
ఈ సందర్భంగా చలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్య ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాజకీయంగా కూడా యాదవులు రాణించాలంటే ముందుగా సామాజిక చైతన్యం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యావంతుల ఐక్య వేదికలను ఏర్పాటు చేసి యాదవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల యాదవ్
జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన మంజుల యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యాదవులలో ఐక్యత, చైతన్యం పెంపొందించి సమాజానికి రావాల్సిన హక్కులు, వాటా సాధించుకునే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
వీడీసీల సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి..
నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీలు) కారణంగా యాదవ కులస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు మంజుల యాదవ్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యాదవులను భయాందోళనలకు గురిచేసే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
హాస్టల్ భవనానికి రూ.లక్ష విరాళం..
రాష్ట్ర రాజధానిలో యాదవ విద్యార్థుల కోసం హాస్టల్ భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.లక్ష విరాళం అందజేస్తున్నట్లు మంజుల యాదవ్ ప్రకటించారు. మహిళగా సామాజిక బాధ్యతలు చేపట్టి ముందుకు సాగడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అందిస్తున్న ప్రోత్సాహం తనకు ఎంతో ధైర్యాన్నిస్తోందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సంఘ నిర్మాణం, విద్యార్థుల అభివృద్ధి, విద్యా, ఉద్యోగ రంగాల్లో యాదవ యువతను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్లు బైకన్ మహేష్ యాదవ్, ఎర్రం గణేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుజ్జ అశోక్ యాదవ్, కార్యదర్శి రాసగిరి యాదవ్, దినేష్ యాదవ్, అధికార ప్రతినిధి ప్రవీణ్ యాదవ్, కోశాధికారి లక్ష్మణ్ యాదవ్, కార్యవర్గ సభ్యులు గంగాధర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ యాదవ్, అనూష యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




