Breaking News

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

తదుపరి ముఖ్యమంత్రి కేసీఆరే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

బాన్సువాడలో మళ్లీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం కృషి చేస్తాం

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.డి. అబ్దుల్ మతిన్ మనోగతం

రుద్రూర్, నవంబర్ 07 (E6tv న్యూస్).

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.డి. అబ్దుల్ మతిన్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికే పట్టం కడతారని, తదుపరి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, పార్టీపై అభిమానం, నియోజకవర్గ రాజకీయాలు, గ్రామ సమస్యలపై తన మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు.

కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి

బీఆర్ఎస్ పార్టీ అంటే తనకు ఎంతో అభిమానం అని, కేసీఆర్ అంటే ప్రత్యేక గౌరవమని అబ్దుల్ మతిన్ పేర్కొన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయని, ప్రస్తుతం ఆయన లేని లోటు ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బాన్సువాడలో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపే లక్ష్యం

రాబోయే ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించేందుకు తామంతా అహర్నిశలు కృషి చేస్తామని మతిన్ తెలిపారు. పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారికి భరోసా కల్పిస్తూ, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం అభినందనీయమన్నారు. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, నేను ఉన్నానంటూ భరోసా ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

1995 నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభిమానిని

1995 సంవత్సరం నుంచి మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట ఉన్నానని, ఆయన అడుగుజాడల్లో నడిచానని అబ్దుల్ మతిన్ తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పోచారం భాస్కర్ రెడ్డి తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, లక్ష్మీపుత్రుడిగా గౌరవించి తన పక్కన కూర్చోబెట్టుకునేవారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తనకు అభిమానం ఉన్నప్పటికీ, తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే వద్దకు ప్రతి కార్యకర్తకు నేరుగా వెళ్లే అవకాశం ఉండాలి

బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య పౌరుడు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండాలని మతిన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాను ఎన్నోసార్లు పోచారం శ్రీనివాస్ రెడ్డిని నేరుగా కలిసి పనులు చేయించుకున్నానని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. కొన్ని పనుల కోసం మధ్యవర్తుల ద్వారా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులకు తప్పుడు సమాచారం అందించడం వల్ల మంచి నాయకుల ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శించారు. ప్రజలకు, కార్యకర్తలకు నాయకులతో నేరుగా సంబంధాలు ఉండేలా వ్యవస్థ ఉండాలని సూచించారు.

ఆర్థిక ఇబ్బందులతో రాజకీయాలకు కొంతకాలం దూరం

కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ బాధ్యతల కారణంగా కొంతకాలం హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చిందని, అందువల్ల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అబ్దుల్ మతిన్ తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుతం సుమారు 60 శాతం వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన ఇంటికి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వచ్చి భరోసా ఇవ్వడం సంతృప్తినిచ్చిందని అన్నారు. కార్యకర్తలు నేరుగా నాయకులను కలిసే అవకాశం కల్పించే బాజిరెడ్డి వంటి నాయకుడు మళ్లీ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పడతారని అభిప్రాయపడ్డారు.

అక్బర్ నగర్‌లో అభివృద్ధి కుంటుపడింది

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో అభివృద్ధి పనులు మందగించాయని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అబ్దుల్ మతిన్ ఆరోపించారు. గ్రామంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, గ్రామసభలు సైతం ప్రశాంతంగా జరగకుండా గొడవలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సంబంధిత నాయకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

భూ కబ్జాల అంశంపై సమగ్ర విచారణ జరపాలి

గ్రామంలో భూముల కబ్జాలకు సంబంధించి వివాదాలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని విషయాల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మతిన్ అన్నారు. ఒకే విధమైన సమస్యలు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూముల ఆక్రమణల ఆరోపణలపై పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీ అనుమతి వస్తే ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం

అక్బర్ నగర్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అబ్దుల్ మతిన్ తెలిపారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి ఇంకా అనుమతులు రాలేదని, అనుమతులు వచ్చిన వెంటనే ప్రజల పక్షాన ఉద్యమాలు చేపట్టి ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ తన పోరాట పటిమను చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *