లింగంపల్లి బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వినతి
రుద్రూరు, నవంబర్ 07 (E6tv న్యూస్).
నూతనంగా బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన దైవభక్తుని నాగేశ్వరరావుకు రుద్రూరు మండలం రాయకూరు గ్రామ ప్రగతి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు తాటే సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కోర్బా సాయిలు (శ్యామ్), ఉపాధ్యక్షుడు మాగిరి ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే నాగేశ్వరరావుకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడం అభినందనీయమన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ఈ పదవి కల్పించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
లింగంపల్లి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలని వినతి
అనేక సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన లింగంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో సిద్ధాపూర్, రాయకూరు, రాయకూరు క్యాంపు, సులేమాన్ ఫారం తదితర గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం ప్రతినిధులు వివరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బోధన్ పట్టణానికి వెళ్లేందుకు రవాణా దూరం తగ్గడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ద్వారా బ్రిడ్జి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేయాలని నాగేశ్వరరావును కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి ఓదెల సత్తయ్య, కోశాధికారి పేదాస్ గంగారాం, సభ్యులు బేగరీ వినోద్, గొడుగు శంకర్, కొబ్బడి లింగయ్య, కోట్ల గంగాధర్, మల్లారం సాయిలు, నీరడీ నాగయ్య, రెహమాన్ ఖాన్ (బాబు), సయ్యద్ రఫీక్, సయ్యద్ సాజిద్, సూర్యవంశి ఏకనాథ్, తాటే సాయికుమార్, తాటే వినీత్ కుమార్, వాగ్మారే రాజు తదితరులు పాల్గొన్నారు.
