ఆందోళన తీవ్రతరం చేస్తాం : కే. రాజన్న
రాంపూర్, నర్సాపూర్ జి, నవంబర్ 17: (E6tv NEWS).
శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్న యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం తక్షణమే చర్చలకు రావాలని, లేనిపక్షంలో ఆందోళనను జిల్లా వ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.మంగళవారం నర్సాపూర్ జి మండలం రాంపూర్‌లోని శివాజీ బీడీ హెడ్ ఆఫీస్‌ను వందలాది మంది కార్మికులతో కలిసి యూనియన్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా కే. రాజన్న మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం చర్చలకు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.
కార్మికులకు నాసిరకం తునికాకు సరఫరా చేస్తూ, మరోవైపు నాణ్యమైన బీడీలు తయారు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గంపకు 2 వేల నుంచి 10 వేల వరకు బీడీలు చాటు చేస్తూ కమిషన్‌దారులను నష్టాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.కార్మికులకు నాణ్యమైన తునికాకు సరఫరా చేయాలని, పీఎఫ్ నంబర్లు కేటాయించాలని, నెలకు 26 రోజుల పని దినాలు కల్పించాలని, రోజుకు వెయ్యి బీడీల తయారీకి సరిపడా పొగాకు అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చొరవ చూపాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. బక్కన్న, ఉపాధ్యక్షులు ఆర్. రామలక్ష్మణ్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎస్. గంగన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
