Breaking News

పెన్షన్ల పండుగ’ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కొత్త పెన్షన్లు పెరిగింది కేవలం 3,424 మాత్రమే.. అధికారిక గణాంకాలతో ప్రభుత్వ ప్రచార ఆర్భాటాన్ని ఎండగట్టిన వేముల

రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైంది? 36 నెలల బకాయిలు రూ.72 వేలు చెల్లించాలి

మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం హామీలను నెరవేర్చాలి

గణాంకాలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మంత్రులు, పీసీసీ అధ్యక్షుడికి వేముల బహిరంగ సవాల్

నిజామాబాద్, నవంబర్ 18: (E6tv NEWS).

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘పెన్షన్ల పండుగ’ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ప్రచార ఆర్భాటానికి తెరలేపుతోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గత మూడేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకుండా, చనిపోయిన పెన్షన్ లబ్ధిదారుల స్థానంలో కొత్తవారికి పెన్షన్లు అందిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోని గణాంకాలు, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు.

జిల్లాలో అదనంగా పెరిగింది కేవలం 3,424 పెన్షన్లే!

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం 2023 డిసెంబర్ నాటికి నిజామాబాద్ జిల్లాలో 2,79,177 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వేముల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరణాలు, ఇతర కారణాలతో 17,131 మందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించగా, ప్రస్తుతం కొత్తగా 20,555 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటించిందన్నారు.

ఈ లెక్కల ప్రకారం పాత లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే జిల్లాలో నికరంగా పెరిగిన పెన్షన్లు కేవలం 3,424 మాత్రమేనని, ఇది ఒక శాతం కంటే తక్కువని పేర్కొన్నారు. చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, మెజారిటీ పెన్షన్లు పాత లబ్ధిదారుల స్థానంలోనే భర్తీ చేశారని విమర్శించారు.

కేవలం 3,424 పెన్షన్లు అదనంగా ఇస్తూ జిల్లాలోని 31 మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ‘పెన్షన్ల పండుగ’ పేరుతో ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఈ సమావేశాలకు ఖర్చు చేస్తున్న ప్రజాధనం పెన్షన్ల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని మించిపోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.బెజ్జోర గ్రామంలో 22 మంది పెన్షన్లను తొలగించి, కొత్తగా 13 మందికి మాత్రమే మంజూరు చేస్తూ పెన్షన్ల పండుగ పేరుతో గ్రామపంచాయతీ వద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని డీపీఓ సర్పంచ్ కార్తీక్‌కు ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

మంత్రులు, పీసీసీ అధ్యక్షుడికి బహిరంగ సవాల్

తాను వెల్లడించిన ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అదే విధంగా తాను చెప్పిన లెక్కలే నిజమని తేలితే జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

3.20 లక్షల మంది కొత్త పెన్షన్లు, మహిళా పథకాల కోసం ఎదురుచూపులు

నిజామాబాద్ జిల్లాలో సుమారు 40 వేల మంది వృద్ధులు, 30 వేల మంది బీడీ కార్మిక మహిళలు కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని వేముల తెలిపారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి హామీ అమలు కోసం సుమారు 2.5 లక్షల మంది మహిళలు నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా జిల్లాలో దాదాపు 3.20 లక్షల మంది వివిధ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

ప్రభుత్వానికి వేముల ప్రధాన డిమాండ్లు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన తర్వాతే ‘పెన్షన్ల పండుగ’ నిర్వహించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • రూ.4 వేల పెన్షన్: అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా ఇప్పటికీ రూ.2,000 మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. పాత 2,79,177 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.72 వేల చొప్పున బకాయిలు చెల్లించి, ఇకపై నెలకు రూ.4,000 అందించాలని డిమాండ్ చేశారు.
  • కొత్త పెన్షన్లు: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 40 వేల మంది వృద్ధులకు, 30 వేల మంది బీడీ కార్మిక మహిళలకు వెంటనే రూ.4,000 చొప్పున కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి.
  • మహాలక్ష్మి పథకం: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ప్రకారం అర్హులైన మహిళలకు 36 నెలల బకాయి రూ.90 వేల చొప్పున చెల్లించి, ఇకపై ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించాలి.
  • తులం బంగారం హామీ: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయాలి. గత మూడేళ్లలో జిల్లాలో వివాహమైన సుమారు 20 వేల నుంచి 25 వేల మంది మహిళలకు తులం బంగారం అందించాలి.

ఈ హామీలను నెరవేర్చకుండా కేవలం కొద్దిమందికి పెన్షన్లు మంజూరు చేసి పండుగల పేరుతో సమావేశాలు నిర్వహిస్తే ప్రజలే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తారని వేముల హెచ్చరించారు. పెన్షన్లు, మహిళలకు ఇచ్చిన హామీలు, బకాయిలు చెల్లించిన తర్వాతే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో బాజిరెడ్డి జగన్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దొంకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, దండు శేఖర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, నవీద్, డోళ్ల రాజేశ్వర్, ఏనుగు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *