Breaking News

కొత్త బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు ధ్వంసం

భారీ లారీల రాకపోకలు, పార్కింగ్‌తో రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసుల ఆవేదన

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్త బీసీ కాలనీ (పరిటాల రవీంద్ర కాలనీ)లో భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీసీ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే మార్గంలో వెలుగు కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో 2024–25 ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.30 లక్షలతో సుమారు 40 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ రోడ్డుపై ప్రతిరోజూ 60 నుంచి 80 టన్నుల లోడు సామర్థ్యం కలిగిన భారీ లారీలు, ఖాళీ లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించడంతో పాటు పార్కింగ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను తీసుకొచ్చి రాత్రింబవళ్లు ఇక్కడ నిలుపుతున్నారని తెలిపారు.

దీంతో రోడ్డు నిర్మించి రెండేళ్లు పూర్తికాకముందే పలుచోట్ల పగుళ్లు ఏర్పడి, రోడ్డు విరిగిపోతున్న పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలు ఇలాగే కొనసాగితే రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కాలనీలో పార్కింగ్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలాగే సిమెంట్ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, ఇప్పటికే దెబ్బతిన్న రోడ్డును పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొత్త బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *