అవకతవకలు జరిగితే రుద్రూర్ సమీకృత భవనం ముట్టడి : బీఆర్‌ఎస్
రుద్రూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి).
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన అసలైన నిరుపేదలకే కేటాయించాలని బీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి గాండ్ల మధు డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని, నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని గాండ్ల మధు పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం మొత్తం 486 దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 150 ఇళ్లను అర్హులైన నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని కోరారు.
ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం అర్హులను గుర్తించి గ్రామసభ నిర్వహించి, ప్రజల సమక్షంలో ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా రుద్రూర్ మండల సమీకృత భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.150 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు అనంతరం మిగిలే అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి చూపించాలని కోరారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు దౌర్ సాయిలు, కన్నె ప్రవీణ్, సిరిగిరి శేఖర్, బొట్టె గజేందర్, కొత్తపల్లి రవికిరణ్, మతీన్, పార్వతి ప్రవీణ్, అల్లా ఉద్దీన్, వంజరి గోపి, శానం పోశెట్టి, సాయికిరణ్, సాయి తేజ, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


