పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి, ఫకృద్ధీన్ పాలెం గ్రామంలోని మైసమ్మ చెరువు గట్టుపై వెలసిన మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామీణ చెరువులకు సరికొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రూ. 73 లక్షల వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును, దాని పరిధిలోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్ మరియు పిల్లల పార్కును ఆయన ప్రారంభించారు. గ్రామాల్లోని చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలందరికీ ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే సామాజిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన పవన్ కల్యాణ్, ఈ మోడల్ చెరువు ప్రాంగణంలో చిన్నారులతో సరదాగా ముచ్చటించి చాక్లెట్లు పంపిణీ చేశారు.
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే రూ. 6 కోట్లతో 11 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ వాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

