Breaking News

SAAP ఆఫీస్ వద్ద రచ్చ:’తోకలు కత్తిరిస్తా’ అని హెచ్చరించిన సీఎం చంద్రబాబు!

విజయవాడ: విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, తమ పత్రాలన్నీ నిజమైనవేనని స్పష్టం చేసేందుకు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగగా, ఉపాధ్యాయులు కూడా ప్రతి నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని వాతావరణం వేడెక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనపై కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న గురువులపై రౌడీలను ఉసిగొల్పి దాడులు చేయడాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని, రౌడీయిజానికి పాల్పడేవారి ‘తోకలు కత్తిరిస్తామని’ తీవ్రంగా హెచ్చరించారు. సాక్షి రిపోర్టర్ ప్రమేయంతో ఒక ఉపాధ్యాయుడిపై దాడికి దిగడం వైసీపీ అరాచక పాలనా మనస్తత్వానికి అద్దం పడుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియామకాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా కోర్టులను ఆశ్రయించాలని హితవు పలికిన సీఎం, స్పోర్ట్స్ కోటా భర్తీపై ప్రతిపక్షానికి ధైర్యముంటే ఆధారాలతో అసెంబ్లీకి రావాలని, అక్కడ తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో వారి నోళ్లు మూయిస్తామని సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *