ప్రజావాణిలో ముస్లిం సోదరుల ఫిర్యాదు
మద్నూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి)
మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ ఎదురుగా ఉన్న మైనారిటీ ముస్లిం స్మశాన వాటిక, ఈద్గా స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లను తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని ముస్లిం సోదరులు అధికారులను కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ముస్లిం సోదరులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ కేంద్రంలోని సర్వే నంబర్ 581లో 0.37 గుంటల స్మశాన వాటిక, ఈద్గా స్థలం ఉన్నట్లు తెలిపారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో సుమారు 20 మంది దుకాణాలు, షెడ్లు ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. కొందరు నిర్మించుకున్న షెడ్లను ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలనెలా ఆదాయం పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు లేవని ఆరోపణ
స్మశాన వాటిక, ఈద్గా స్థలాన్ని కాపాడాలని గతంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ముస్లిం సోదరులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలపై విచారణ జరిపి, అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లను తొలగించి స్మశాన వాటిక స్థలాన్ని పరిరక్షించాలని వారు కోరారు.

