పెనుకొండ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు
సుమారు 150 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాల పంపిణీ
పెనుకొండ, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి).
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు పెనుకొండ మున్సిపాలిటీలోని తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి సవిత డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న మంత్రి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెనుకొండ మున్సిపాలిటీలో ఇప్పటికే మంజూరైన సుమారు రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన గృహాలతో పాటు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సుమారు 20 ఏళ్లుగా ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురు కుటుంబాలకు అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి, సుమారు 150 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాలను మంత్రి సవిత స్వయంగా అందజేశారు. ఇంటి పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పరిశీలన
అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను మంత్రి సవిత సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా, ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల సందర్శనలో భాగంగా విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును మంత్రి పరిశీలించారు. డ్రైవర్ లైసెన్స్‌తో పాటు బస్సు ప్రమాణాలను తనిఖీ చేసి, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




