Breaking News

తానూర్‌లో ఇంటిపై పిడుగుపాటు

తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం

తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).

నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిడుగు తీవ్రతకు ఇంటి ఒక భాగం కూడా దెబ్బతిని కొంతమేర కూలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు.

“దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం”

పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో తాము ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి తృటిలో బయటపడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల పరిశీలన

పిడుగుపాటుకు గురైన ఇంటిని తానూర్ తహసీల్ కార్యాలయానికి చెందిన గిర్దావర్, పట్వారీతో పాటు గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందించాలని స్థానికులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *