Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి

భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు.సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విని స్పందించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి గ్రామంలో తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సర్పంచులకు సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *