Breaking News

‘శాప్’ ఘటనపై జగన్‌ను అరెస్టు చేయాలని:బుద్దా వెంకన్న

విజయవాడలోని శాప్ (SAAP) కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారని, దేవుడు ఇచ్చిన ఉద్యోగాలను కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయులపై దాడులు చేయించడం నీచమైన చర్య అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వంటి నాయకులు ఆకు రౌడీల్లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… నాటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన రౌడీల్లో 51 మంది నిన్న ఉపాధ్యాయులపై దాడి చేసేందుకు వచ్చారని పోలీసులు గుర్తించారని తెలిపారు. మొన్నటి దాడికి అసలు సూత్రధారి వైఎస్ జగన్ అని, అమాయక ఉపాధ్యాయులపై దాడులు చేయించిన ఆయనను ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా (A1) చేర్చి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌పై ఫిర్యాదు చేయడానికి తాను స్వయంగా డిజిపి (DGP)ని కలవనున్నట్లు వెల్లడించారు. బందరు రోడ్డుపై గంటల తరబడి హల్‌చల్ చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రౌడీలను తాడేపల్లి ప్యాలెస్‌లో దాచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఈ అరాచకాలపై కఠినంగా స్పందించాలని, ఉద్యోగులు మరియు ప్రజలందరూ కలిసి వైసీపీ నైజానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *