ఇందూర్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి)
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంజూరైన రూ.1.25 కోట్లతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణ బాధ్యతలను నీటిపారుదల శాఖ నుంచి నగర కార్పొరేషన్‌కు అప్పగించాలని సూచించారు.
నార్త్ మండలానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25న ఇందూరులో నిర్వహించనున్న గణపతి నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్లైట్ల సమస్యను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. వీలైనంత త్వరగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇరిగేషన్ శాఖ ఈఈ నరేందర్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



