విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భద్రతా వ్యవస్థను సవాల్ చేస్తూ సాగుతున్న విలువైన కాపర్ (రాగి) చోరీల వ్యవహారం సంచలనంగా మారింది. ప్లాంట్ ఉద్యోగుల మాదిరిగా నకిలీ గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశిస్తూ కాపర్‌ను దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ ఐడీ కార్డులు, ఫేక్ సీఐఎస్ఎఫ్ స్టాంపులు! స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల గుర్తింపు కార్డులను సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి ఈ ముఠా ఫేక్ ఐడీ కార్డులను తయారు చేసింది. అంతటితో ఆగకుండా తనిఖీలను తప్పించుకునేందుకు నకిలీ సీఐఎస్ఎఫ్ (CISF) స్టాంపులను కూడా ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
300 కిలోల కాపర్‌తో పోలీసులకు చిక్కిన నిందితులు: తాజాగా సుమారు 300 కిలోల కాపర్‌ను ప్లాంట్ వెలుపలికి తరలించే ప్రయత్నంలో ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. అరెస్టయిన నిందితులను పైడిపాటి వెంకట భార్గవ్, పోతిన శ్రీకాంత్, ఇసుకపల్లి నాగేంద్ర వర్మ, గర్తియ రవి శంకర్, బంగారు సతీష్ కుమార్, ఇసుకపల్లి వంశీ, నవాబు యువరాజుగా పోలీసులు గుర్తించారు.
లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా? అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో ఇన్నాళ్లూ చోరీలు జరగడంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ముఠాకు ప్లాంట్ అంతర్గత సమాచారం అందించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యలు ప్రారంభించింది.

