కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య
200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్).
గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
200 సీసీ కెమెరాలతో నిఘా
నగరంలోని ప్రధాన రహదారులు, గణేష్ విగ్రహాల తరలింపు మార్గాలు, నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నిమజ్జన కేంద్రాల వద్ద పరిస్థితులను సుమారు 200 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తూ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. నిమజ్జన కేంద్రాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించాలి
ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ సాయి చైతన్య కోరారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

