Breaking News

రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – హక్కులను కాపాడుకుందాం

బోధన్, సెప్టెంబర్ 30:(E6 tv NEWS: ప్రతినిధి).

చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్, బోధన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని బోధన్ మండలం అమ్డాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు డా. వారే దస్తగిరి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డా. దస్తగిరి మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని, తమ హక్కులు, విధులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. యువతలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌర సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సుదర్శన్, పెర్కా వెంకటేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాజ్యాంగ ప్రతులను అందజేశారు.

“రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – హక్కులను కాపాడుకుందాం – బాధ్యతలను నిర్వర్తిద్దాం” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *