‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం
పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు
ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో, సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, కమ్యూనికేషన్, నాయకత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాల్లోనూ అభివృద్ధి చెందేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ హైస్కూల్, పోతుకుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ‘పర్యావరణ పరిరక్షణ’ అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. చెట్ల ఆవశ్యకత, ప్రకృతి పరిరక్షణ, పరిశుభ్రమైన పరిసరాలు తదితర అంశాలను విద్యార్థులు తమ చిత్రాల ద్వారా చాటిచెప్పారు.డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. హరీష్ బాబు, ఏకలవ్య ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పద్మావతి, గోపాలకృష్ణ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. చదువుతో పాటు సృజనాత్మక, విజ్ఞాన, సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని హరీష్ బాబు తెలిపారు. అనంతరం 28వ వార్డు మున్సిపల్ ప్రైమరీ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న విద్యా వికాసం కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పద్మావతి, గోపాలకృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గౌడ్, పోతుకుంట రాజు, పట్టణ అధ్యక్షులు జింక చంద్ర, అంబటి సతీష్, బిల్లే శీన, కుంచుపు నారప్ప, రవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



