ఓటర్ల జాబితా సవరణ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం నిరంకుశత్వమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తూ కేంద్రం కనుసన్నల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని అప్రజాస్వామికంగా అభివర్ణించిన మంత్రి, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు గ్రామీణ స్థాయి నుంచి ‘దేశ్ బచావో.. ఓట్ బచావో’ పేరుతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
