వర్ని, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నీటి కొరతతో ఎండిపోతున్న వరి పంటలను ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎత్తిపోతున్నా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మోరిల్ శ్రీనివాస్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కొరత, పంటల సాగు కోసం చేసిన పెట్టుబడులు, పంటలు చేతికందకపోవడంతో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రైతుల ఆవేదనను తెలుసుకున్న మోరిల్ శ్రీనివాస్ వారి సమస్యలను మాజీ మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్లారు. నీటి కొరత కారణంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి అర్హులైన రైతులకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు మోరిల్ శ్రీనివాస్ చొరవ చూపడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాలను స్వయంగా తెలుసుకుని, పరిష్కారం కోసం స్పందించడం అభినందనీయమని రైతులు పేర్కొన్నారు.
