Breaking News

ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు భార్యతో కలిసి లక్ష్మీనారాయణ వెళ్లాడు. పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో పాటు చెమటలు పట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే పని నుంచి ఇంటికి చేరుకున్నాడు.

తన ఆరోగ్య పరిస్థితి గురించి కుమారులకు తెలియజేయడంతో, వారు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే లక్ష్మీనారాయణ కింద కూర్చున్న స్థితిలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.మృతుడు లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *