Breaking News

పొతంగల్ పరిసరాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా!

మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి యథేచ్ఛగా తరలింపు?

బొలెరో వాహనాల్లో ఇసుక రవాణా.. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు

అధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్

రుద్రూర్, అక్టోబర్ 10 (E6tv NEWS: శివ ఠాకూర్).

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల మంజీరా నది సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా బొలెరో తదితర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తూ, అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మంజీరా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం రుద్రూర్‌లో బొలెరో వాహనంలో ఇసుక తరలిస్తున్న దృశ్యం కనిపించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రాంతంలో ప్రతిరోజూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉండటంతో పాటు, సహజ వనరుల పరిరక్షణపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.జిల్లా స్థాయి అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మంజీరా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతులను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *