సిండికేట్‌గా ఏర్పడి బయటి వ్యాపారులకు బెదిరింపులు.. గిట్టుబాటు ధరకు గండి
రుద్రూరు, అక్టోబర్ 10 (E6 NEWS: ప్రతినిధి).
పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంటే కొందరు దళారులు సిండికేట్‌గా ఏర్పడి అడ్డంకులు సృష్టిస్తున్నారని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను బెదిరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని రుద్రూరుకు చెందిన రైతు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ.. తాను గత 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. ఈసారి బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ పంటకు క్వింటాల్‌కు రూ.3,800 చొప్పున ధర ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, అయితే కొందరు దళారులు వారిని బెదిరించడంతో ప్రస్తుతం ధర క్వింటాల్‌కు రూ.3,600కు తగ్గిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, పంట పండించేందుకు చేసిన ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు మంచి ధర లభించే సమయంలో అడ్డంకులు సృష్టించడం ఎందుకని ప్రశ్నించారు. దళారుల జోక్యాన్ని అరికట్టి, రైతులకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యపై స్పందించిన తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, దళారుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫోన్ చేయడం సంతోషంగా ఉందని రైతు బాబు పేర్కొన్నారు. రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు స్వేచ్ఛగా పంటను విక్రయించుకునే అవకాశం కల్పించాలని, వ్యాపారుల మధ్య పోటీతో మెరుగైన ధర లభించేలా చూడాలని, దళారుల బెదిరింపులకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని రైతు బాబు కోరారు.

