Breaking News

కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్‌పై కిషన్ రెడ్డి!

ప్రజాస్వామ్య హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్వేచ్ఛగా నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం అనుమతిస్తోందని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం బీజేపీ నేతల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో రైతుల సమస్యలు, పోలీసు నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వంటి ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టడానికి ప్రయత్నిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పలువురు ప్రముఖ నేతలను గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వేచ్ఛగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర వ్యవస్థలను విమర్శిస్తున్నా కేంద్రం ఎన్నడూ వారి హక్కులను అడ్డుకోలేదని గుర్తుచేశారు.

“ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులు.. తెలంగాణలో బీజేపీ నేతలకు ఎందుకు వర్తించవు?” అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేవలం చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటే సరిపోదని, అధికారంలో ఉన్నప్పుడు దానిని నిజంగా ఆచరించాలని హితవు పలికారు. 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి ప్రతిపక్ష నేతలను జైళ్లలో మగ్గేలా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఆయన ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *