సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సంస్థలోని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ కానుకను ప్రకటించింది. కంపెనీ సాధించిన లాభాల్లో ఏకంగా 34 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం వెల్లడించారు. దీనివల్ల ప్రతీ శాశ్వత కార్మికుడికి రూ. 1,51,912 మేర దసరా బోనస్ అందనుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,500 బోనస్ చెల్లించనున్నారు.
ఈ ఏడాది సింగరేణి సంస్థ మొత్తం రూ. 1,754 కోట్ల నికర లాభాన్ని గడించిందని, ఇందులో కార్మికుల కష్టానికి తగిన గుర్తింపుగా 34 శాతాన్ని బోనస్‌గా పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. పండుగ పూట కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు:
- కారుణ్య నియామకాలు: సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 300 కారుణ్య నియామకాల ప్రక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి, వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు.
- ఆధునిక హౌసింగ్ కాలనీలు: గనుల తవ్వకం లేని సురక్షిత ప్రాంతాలలో కార్మికుల సంక్షేమం కోసం ఆధునిక వసతులతో కూడిన నూతన మోడల్ హౌసింగ్ కాలనీలను నిర్మించాలని నిర్ణయించారు.
