కేంద్ర పథకాలతో కోట్లాది మందికి లబ్ధి
‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, అక్టోబర్ 14 (E6 TV NEWS: శివ ఠాకూర్).
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రపంచంలో విశ్వగురువుగా నిలిచే దిశగా పయనిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఇందూరులోని శ్రద్ధానంద్ గంజిలో నిర్వహించిన ‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోదీ 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు దేశ ప్రధానిగా ప్రజాసేవ చేశారని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, పేద కుటుంబాలు, వృద్ధులు, విద్యార్థులు, చిరు వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. వైద్యం, గృహ నిర్మాణం, బ్యాంకింగ్, ఆహార భద్రత వంటి రంగాల్లో పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ఉజ్వల యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు.2014 తర్వాత జాతీయ రహదారులు, రైల్వేలు, ఆసుపత్రులు, అంతరిక్షం, వైమానిక, రక్షణ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
చాయ్ విక్రయం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీ
అనంతరం ఇందూరు ఛాయ్‌వాలా మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ చిరస్మరణీయ నాయకుడని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలో రైల్వే స్టేషన్లో చాయ్ విక్రయించిన అనుభవం నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.మోదీ 25 ఏళ్ల ప్రజా రాజకీయ జీవితం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకమని అన్నారు. తన కుటుంబ నేపథ్యం కూడా చాయ్ విక్రయంతో ముడిపడి ఉండటంపై గర్వంగా ఉందని స్వామి యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామ్, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్, గుమస్తా సంఘం అధ్యక్షుడు బాలు, దడువై సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, హమాలీ సంఘం అధ్యక్షుడు అంజయ్య యాదవ్, పైట వెంకటేశం, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.



