Breaking News

ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్).

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టించినా, ఓటర్లను బెదిరించినా, భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైన మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

ధర్మవరం ప్రాంతంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి బెదిరింపులు, అక్రమాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *