Breaking News

విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శ

ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్).

విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా, ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరారు. అలాగే సహకార సంఘాల వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని జాజాల సురేందర్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *