Breaking News

కాంగ్రెస్ అసమర్థ పాలనతో విద్యుత్, సాగునీటి సంక్షోభం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి.. ఎస్సారెస్పీ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్

వేల్పూర్, అక్టోబర్ 15: (E6tv న్యూస్).

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన, ముందుచూపులేని విధానాలతో రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందక, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గురువారం వేల్పూర్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. తక్కువ వోల్టేజీ, తరచూ విద్యుత్ అంతరాయాల కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. వాటి మరమ్మతుల్లో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.విద్యుత్ కొరతకు ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులే కారణమని ప్రభుత్వం చెబుతున్న వాదనను ఆయన తప్పుబట్టారు. వాతావరణ పరిస్థితులు సమానంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి తగినంత బొగ్గు సరఫరా చేయాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయిలో నడిపించి రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.

సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, బొగ్గు నిల్వలు, టెండర్ల అవకతవకలు, సైట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల వ్యవహారాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, కాలిపోయిన వ్యవసాయ మోటార్ల మరమ్మతు ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అన్నారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను మూడు రోజుల్లోగా మరమ్మతు చేయాలని లేదా కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు.

ఎస్సారెస్పీ నుంచి 4 టీఎంసీల నీరు విడుదల చేయాలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో పంటలను కాపాడటంతోపాటు తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి తక్షణమే 3 నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపడం లేదని, లక్ష్మీ కెనాల్ ద్వారా కూడా తగినంత నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. గుత్ప లిఫ్ట్ ద్వారా ప్రస్తుతం 360 క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 360 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలను పూర్తిస్థాయిలో నడిపించి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.మెంట్రాజ్‌పల్లి పంపులను ప్రారంభించి ప్యాకేజీ-21 ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీటిని నింపాలని, వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసే సమయంలో బాల్కొండ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందేలా ఎస్సారెస్పీలో నీటిమట్టాలను నిర్వహించాలని సూచించారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం

రైతులకు రోజుకు ఎన్ని గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తారో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాలని అన్నారు. సాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడిపించాలని కోరారు.రైతాంగ సమస్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే రైతులతో కలిసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్, కల్లెడ ఏలీయా, నాగదర్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, మాజీ ఎంపీపీ మహేష్, నియోజకవర్గ పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *