ఆడపిల్ల పుట్టిన తల్లులకు రూ.5 వేల ఆర్థిక సాయం, దుస్తులు, తల్లి కిట్ అందజేత
పోతంగల్, అక్టోబర్ 16: (E6 న్యూస్ ప్రతినిధి).
పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీమ్ అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని స్థానికులు కొనియాడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలోని కొల్లూరు, కారేగాం, హంగర్గ ఫారం, పోతంగల్, పాత పోతంగల్ గ్రామాల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయంతో పాటు దుస్తులు, తల్లి కిట్‌ను అందజేశారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేదలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.గ్రామగ్రామాన ఆయన సేవలు విస్తరిస్తుండటంతో లబ్ధిదారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, పేదలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం అభినందనీయమని పేర్కొంటున్నారు.
సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవత్వం, సోదరభావం పెంపొందించేందుకు డాక్టర్ ఎంఏ హకీమ్ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. నిత్యం ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.డాక్టర్ ఎంఏ హకీమ్‌తో పాటు పలువురు సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరుపేదలకు అండగా నిలుస్తూ, సమాజ సేవే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషి మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
