Breaking News

రైతుల విద్యుత్ కష్టాలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు!

₹10.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ

జుక్కల్, అక్టోబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి).

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, వ్యవసాయ పనులకు విద్యుత్ అంతరాయాల వల్ల ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా జుక్కల్ నియోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ్‌పల్లి–ఆరేపల్లి, కాటేపల్లి, లచ్చన్, తడ్గూర్ గ్రామాల్లో మొత్తం రూ.10.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ చేశారు.

ఈ సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, రైతులకు సాగు సమయంలో ఎదురయ్యే విద్యుత్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడం, సరఫరాలో అంతరాయాలను తగ్గించడం ఈ నిర్మాణాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *