Breaking News

ధర్మవరం పట్టణ అభివృద్ధికి రూ.242.28 కోట్ల సమగ్ర ప్రణాళిక

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యం

ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి)

ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రభుత్వ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పనులకు శ్రీకారం చుట్టగా, అమరావతి నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు.

హ్యామ్ కింద రూ.43 కోట్ల పనులు

ధర్మవరం మున్సిపాలిటీకి హ్యామ్ కింద రూ.43 కోట్ల విలువైన పనులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు.

27 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి

అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద మరో రూ.43 కోట్లతో సుమారు 25 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. పట్టణంలో రహదారి మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

తాగునీటి వ్యవస్థకు భారీ నిధులు

అమృత్ ఫేజ్–1 కింద రూ.17.57 కోట్లతో ఈఎల్‌ఎస్‌ఆర్‌లు, పంప్‌హౌస్, మోటర్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టగా, వీటిలో సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అమృత్ ఫేజ్–2 కింద రూ.11.18 కోట్లతో ఈఎల్‌ఎస్‌ఆర్, పంపింగ్ మెయిన్, డెలివరీ లైన్ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

అమృత్ 2.0 కింద రూ.31.73 కోట్ల సమగ్ర తాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో రోజుకు 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పలు ప్రాంతాల్లో ఈఎల్‌ఎస్‌ఆర్‌లు, పైప్‌లైన్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయని వివరించారు.

పారిశుద్ధ్యానికి రూ.21.68 కోట్లు

ఎస్‌బీఎం 2.0 కింద ధర్మవరం పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.21.68 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

ఇప్పటికే పలు పనులు పూర్తి

బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ నిధులతో రూ.3.90 కోట్ల వ్యయంతో 13 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.4.19 కోట్లకు పైగా వ్యయంతో 17 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మున్సిపల్ సాధారణ నిధులతో రూ.2.23 కోట్లకు పైగా వ్యయంతో 58 అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.2.54 కోట్లతో డీఐ కే9 పైప్‌లైన్ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద సద్భావన భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు.

మరో రూ.95 కోట్లకు పైగా పనులు అనుమతుల దశలో

యూఐడీఎఫ్–4 కింద రూ.72 కోట్ల విలువైన పనులు, యూసీఎఫ్ ఫేజ్–2 కింద డ్రైనేజీ పనులకు రూ.23 కోట్ల విలువైన పనులు పరిపాలనా అనుమతుల దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులతో రూ.5.20 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, పూడికతీత పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

రూ.104.28 కోట్ల పనులు పురోగతిలో

ధర్మవరం పట్టణంలో వివిధ పథకాల కింద ప్రస్తుతం రూ.104.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వాటర్ ట్రీట్‌మెంట్, ఈఎల్‌ఎస్‌ఆర్‌లు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంతో పాటు, పట్టణాన్ని సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన ప్రాంతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *