Breaking News

అణిచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కుంటాల:, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)

అణిచివేతకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితం కాదన్నారు. నిజాం పాలనలో అణిచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు.

విద్య ద్వారానే భవిష్యత్ తరాలు ఉన్నత స్థాయికి ఎదగగలవనే సందేశాన్ని ఐలమ్మ తన జీవితంతో చాటిచెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ఆమె ఆశయాలను కేవలం స్మరించుకోవడం కాకుండా, వాటిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభాముఖంగా ఎమ్మెల్యే కోరారు. ఈ అంశాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల గొంతుకగా తన వాణిని వినిపిస్తానని హామీ ఇచ్చారు.

ఐలమ్మ ఆశయాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *