గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలా కార్యక్రమం నిర్వహిస్తాం
ఈ ఏడాది 33 జిల్లాలతో పాటు విదేశాల్లో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో పాటు జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీని కవిత ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ వేడుకలను గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదన్నారు.
ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో, అలాగే వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసేలా బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.వచ్చే ఏడాది నిర్వహించనున్న భారీ బతుకమ్మ వేడుకలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తామని, గ్రామ స్థాయి నుంచి బతుకమ్మ కమిటీలు, కోలాటం కమిటీలు ఏర్పాటు చేసి మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తామని కవిత తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో రాష్ట్రంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటలు, చప్పట్ల పాటలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పాటల సీడీని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే పలు బతుకమ్మ పాటలను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
గిన్నిస్ రికార్డు సాధించే లక్ష్యంతో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి మాట్లాడుతూ వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.జాగృతి నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. చప్పట్ల పాటలు, సంప్రదాయ బతుకమ్మ పాటలను ఇప్పటికే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు.
సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారతే లక్ష్యం
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి ఇకపై మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారతతో పాటు సమాజంలోని అసమానతలను రూపుమాపే దిశగా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేసి తెలంగాణ సమాజానికి విస్తృతంగా సేవలందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు వివిధ దేశాలకు జాగృతి కమిటీలను ప్రకటించారు. మిగిలిన జిల్లాల కమిటీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
- రాష్ట్ర అధ్యక్షురాలు: మారిపెల్లి మాధవి
- ఉపాధ్యక్షులు: జాడి శ్రీనివాస్, పర్శ చంద్రశేఖర్
- ప్రధాన కార్యదర్శి: గుంటి సుందర్
- కార్యదర్శులు: కన్నం శారద, దొండి స్వర్ణలత, మస్తాన్
- మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు: మానుకోట సునీత
వివిధ జిల్లాల అధ్యక్షులు
జగిత్యాల – పట్టూరి తిరుపతి
రంగారెడ్డి – ఎండీ మొయినుద్దీన్
వరంగల్ – పొలుదాసరి రమేశ్
హన్మకొండ – నెట్టి రజిత
మహబూబ్‌నగర్ – ఏర్పుల నర్సింలు
సూర్యాపేట – లక్కపాక ప్రవీణ్
భూపాలపల్లి – గుమ్మడి రవీందర్
నిజామాబాద్ – అవంతి కుమార్
పెద్దపల్లి – మేడారపు రాజ్యలక్ష్మీ
కరీంనగర్ – గుండు మంజుల
కామారెడ్డి – రెడ్డిపేట సతీశ్ కుమార్
విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి కమిటీలు
మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వేణుగోపాల్ యాదవ్‌ను నియమించారు. విదేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా న్యూజిలాండ్‌కు ముద్దం అరుణ జ్యోతి, ఖతార్‌కు ప్రవీణ లక్ష్మీ, యూఎస్ఏకు రాజ్ గోవిల్కర్, ఓమన్కు గుండు రాజేందర్ నేత, కెనడాకు కుందె రాఘవేంద్ర యాదవ్, ఐర్లాండ్‌కు సంతోష్ పల్లె, స్విట్జర్లాండ్‌కు కిశోర్ తాటికొండ, ఇటలీకి సౌమ్య పిన్నంరెడ్డి, నార్వేకు కిరణ్ తేజ సూధటి, జింబాబ్వేకు శ్రావణ్ కుమార్ గౌడ్, కెన్యాకు గంట్ల స్వప్నా రెడ్డిలను నియమించారు.ఖతార్ ప్రధాన కార్యదర్శిగా ఆదర్శ రెడ్డి పోతుల, నార్వే ప్రధాన కార్యదర్శిగా నిఖిత బిల్లకంటి నియమితులయ్యారు.బతుకమ్మ చప్పట్ల పాటల కోసం తెలంగాణ జాగృతి వెబ్సైట్లో ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.



