తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) గుర్తింపు సంఘం ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ‘తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్’ (TWU)కు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ స్పష్టమైన ఆదేశాలు:
- TWUకే మద్దతు: టీడబ్ల్యూయూ (TWU) యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఈ యూనియన్ కట్టుబడి ఉందనడంలో సందేహం లేదని ఆయన పేర్కొన్నారు.
- నాయకులకు దిశానిర్దేశం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో టీడబ్ల్యూయూ యూనియన్ అభ్యర్థులకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆదేశించారు.
- ఇతర యూనియన్లకు చెక్: కాంగ్రెస్ మద్దతు ఇచ్చే టీడబ్ల్యూయూ కాకుండా ఇతర ఏ ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని, క్రమశిక్షణ తప్పకుండా పని చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ఇన్‌చార్జిగా బొంతు రామ్మోహన్:
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను, ఆర్టీసీ కార్మికులను సమన్వయం చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఎన్నికల సమన్వయకర్త (ఇన్‌చార్జి)గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో కార్మికులంతా ఏకమై టీడబ్ల్యూయూను భారీ మెజార్టీతో గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

