20 ఏళ్ల పాటు దేశానికి సేవలు.. ఇప్పుడు గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం
చెన్నేకొత్తపల్లి, నవంబర్ 15 (E6tv న్యూస్).
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ సైనిక ఉద్యోగి వడ్డే శ్రీనివాసులు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆయన అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పూర్తి మద్దతు ప్రకటించినట్లు స్థానిక నాయకులు తెలిపారు.వడ్డే శ్రీనివాసులు గతంలో భారత సైన్యంలో 20 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందారు. దేశ సేవ అనంతరం గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్థానిక రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
సైనిక సేవల అనంతరం కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నేకొత్తపల్లి, పరిసర ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సహకరించడంతో పాటు, గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా వైకుంఠ రథాన్ని సమకూర్చారు. కరోనా కష్టకాలంలో గ్రామ ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అండగా నిలిచారు.తాజాగా వడ్డే శ్రీనివాసులును సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించడంపై పలువురు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో వడ్డే శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు, ఎల్. నారాయణ చౌదరికి, టీడీపీ సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
