ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి, నవంబర్ 16: (E6tv NEWS).
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటై రెండు నెలలు పూర్తయిన సందర్భంగా సోమవారం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో జర్నలిస్టుల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చినట్లు కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పిన్నూరి రమేష్, కార్యదర్శి యశ్వంత్ పవర్, శంభులింగం, సాయిరాం గౌడ్, శ్రీనివాస్, పోచన్న, బన్సీలాల్, ఉప్పల్ రాము, సీనియర్ జర్నలిస్ట్ ప్యాలల రాములు, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

