Breaking News

స్పెషల్ ఫండ్ కేటాయిస్తే నగరంలో మరింత అభివృద్ధి

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది

8వ డివిజన్‌లో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, నవంబర్ 17: (E6tv NEWS).

రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్) కేటాయిస్తే నగరంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని 8వ డివిజన్ సీతారాంనగర్ కాలనీలో బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఇటీవల కేటాయించిన రూ.20 లక్షల నిధులతో ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కొన్ని డివిజన్లలో కోటి రూపాయల విలువైన పనులు సైతం చేపట్టినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. మూడేళ్లు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరంలో కొత్త కాలనీలు వేగంగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్ మఠం పవన్, కాలనీ పెద్దలు కిషన్, శ్రీనివాస్, విశ్వ సాయి, శివశంకర్, లింగాల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *