Breaking News

జీవో 59 దరఖాస్తులకు నెల రోజుల డెడ్‌లైన్!

తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22ఏ కింద సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న భూమి మరియు ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జీవో 59 కింద 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ (Regularisation) కోసం వచ్చిన దరఖాస్తులను రాబోయే నెల రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలు 14, 22, 29, 41కి అనుగుణంగా ప్రభుత్వం మెమో నంబర్ 48030 జారీ చేసింది.

శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుతో సహా ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. శాసనసభలో ఇచ్చిన హామీల మేరకు సెక్షన్ 22ఏ పరిధిలోని 10 నుంచి 12 రకాల భూ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జీవో 59 అమలులో కొన్ని అక్రమాలు జరిగాయని, అర్హులైన సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తూనే అక్రమార్కులపై కఠిన సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కోర్టు వివాదాలు లేని, పూర్తి నిబంధనలకు లోబడి ఉన్న చిన్న ఇళ్ల స్థలాల దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి, కన్వేయన్స్ డీడ్లను పారదర్శకంగా అందించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న ప్లాట్లు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ సమస్యలు, నాలా ప్రక్రియ పెండింగ్ ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల మార్గం సుగమం కాగా, జీవో 59 ఉత్తర్వులు కూడా వెలువడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *