ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన విశ్వాస సంక్షోభం నెలకొందని, ఇద్దరు కమిషనర్లు వ్యక్తంచేసిన ఆందోళనలు అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినందున ఈ అంశంపై మరే ప్రభుత్వ సంస్థ విచారణ జరిపే అవకాశం లేదని, అందుకే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి సమగ్ర విచారణ జరపడం ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయని మరియు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

