దుబ్బ చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు అంగరంగ వైభవంగా రథయాత్ర
ఇందూరు, సెప్టెంబర్ 25: (E6tv NEWS: శివ ఠాకూర్).
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఇందూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం వినాయకుడి రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో ఇందూరులోనూ వినాయకుడి రథయాత్ర ప్రారంభమైందని గుర్తు చేశారు. వందేళ్లుగా ఈ రథయాత్ర సంప్రదాయం కొనసాగుతోందన్నారు.
21 జతల ఎడ్లతో అలంకరించిన రథంతో శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల మీదుగా వినాయకుల బావి వరకు కొనసాగుతుందని తెలిపారు. యువత భక్తి మార్గంలో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందూరు యువత ఉత్సాహం, భక్తి భావానికి ఈ శోభాయాత్ర నిదర్శనమని పేర్కొన్నారు.శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




