జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి అమలు
ఇంటి వద్దకే 41 రకాల ఉచిత వైద్య పరీక్షలు.. 48 గంటల్లో రిపోర్టులు
ధర్మవరం, సెప్టెంబరు 25:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, వైద్య పరీక్షల నుంచి చికిత్స వరకు అవసరమైన వైద్య సేవలను అనుసంధానం చేసే ‘సంజీవని’ కార్యక్రమాన్ని డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించి, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు.ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 933 ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను మంత్రి ప్రారంభించారు.
41 రకాల పరీక్షలు ఉచితం
ఆరోగ్య రథాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. డయాబెటిస్, రక్తం, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయని చెప్పారు. సాధారణంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యే కొన్ని పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. పరీక్షలు పూర్తయిన 48 గంటల్లోపు రిపోర్టులను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తామని చెప్పారు.ఆరోగ్య సమస్య గుర్తించిన తర్వాత కేవలం రిపోర్టు ఇచ్చి వదిలేయకుండా, సంబంధిత వ్యక్తికి అవసరమైన తదుపరి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్రతి వ్యక్తికీ ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్
‘సంజీవని’ డిజిటల్ వేదిక ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను ఒకే చోట నమోదు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత పరీక్షల ఫలితాలు, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూపు, గతంలో తీసుకున్న చికిత్స, ప్రస్తుతం వాడుతున్న మందులు తదితర వివరాలు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయని చెప్పారు.ప్రతి వ్యక్తికి బయోడేటా ఉన్నట్టే ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ కూడా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు గత ఆరోగ్య చరిత్రను పరిశీలించి తదుపరి చికిత్సను కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
2 వేలకుపైగా ఆసుపత్రుల్లో సమన్వయకర్తలు
రాష్ట్రవ్యాప్తంగా 2,000కుపైగా ఆసుపత్రుల్లో సమన్వయకర్తలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల ఫలితాలను పరిశీలించిన అనంతరం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సమన్వయకర్తలు సంబంధిత వ్యక్తులను సంప్రదిస్తారని చెప్పారు.బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి ఏ ఆసుపత్రికి వెళ్లాలి, ఏ వైద్యుడిని కలవాలి, అపాయింట్‌మెంట్ ఎలా పొందాలి అనే విషయాల్లో సహకరిస్తారని తెలిపారు. చికిత్స అనంతరం మందులు సక్రమంగా వాడుతున్నారా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశాలను కూడా పర్యవేక్షిస్తారని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 933 ఆరోగ్య రథాలు
రాష్ట్రవ్యాప్తంగా 933 ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇవి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగ్య వివరాలను నమోదు చేస్తాయని చెప్పారు.గతంలో 104 వాహనాలు, చంద్రన్న సంచార చికిత్స, ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమాలు అమలు కాగా, ఇప్పుడు పరీక్షలు, ఫలితాలు, తదుపరి వైద్యం, చికిత్స అనంతర పర్యవేక్షణను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
కుప్పం నుంచి ధర్మవరం వరకు..
కుప్పంలో ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. గిద్దలూరు, గన్నవరం ప్రాంతాల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించి, జనవరి 1 నుంచి ఆరోగ్య రథాలను ‘సంజీవని’తో అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
ముందుగానే వ్యాధులను గుర్తించడమే లక్ష్యం
వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అనారోగ్యం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా, పేదలకు వైద్య సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ‘సంజీవని’ ఉద్దేశమని చెప్పారు.
రామాయణంలో ప్రాణాలను కాపాడిన ‘సంజీవని’ ఔషధం పేరుతో ఈ కార్యక్రమానికి నామకరణం చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, అనంతపురం జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, శ్రీ సత్యసాయి జిల్లా డీఎంహెచ్‌వో ఫైరోజ్ బేగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవో రాంభూపాల్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్, ఎన్టీఆర్ వైద్యసేవ అధికారులు, 104 ఆరోగ్య రథాల సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



