ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై చెలరేగిన వివాదం నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI)పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. మీరు చేస్తున్నది తప్పు, ఇది దేశద్రోహంతో సమానం.. సమయం వస్తుంది, మిమ్మల్ని పట్టుకుంటాం, తప్పించుకోలేరు” అని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘ఓటు చోరీ’ అనేది రాజ్యాంగం మరియు భారత ప్రజలపై నేరుగా దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు.
గత 10 నెలల్లో ఓటర్ల జాబితాల సవరణ, పేర్ల తొలగింపు వంటి అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వెలువడిన కథనాల ఆధారంగా రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించింది. కమిషనర్లు కేవలం సూచనలు మాత్రమే చేశారని, అధికారికంగా ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందిస్తూ, ‘సార్’ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేసి, పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

