హైదరాబాద్: తెలంగాణ సామాజిక, రాజకీయ ఆకాంక్షలకు, ఉద్యమ భావజాలానికి ప్రాతిపదికగా రాష్ట్ర రాజకీయ యవనికపై త్వరలోనే నూతన పార్టీ ఆవిర్భవించబోతోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా విప్లవోద్యమాల్లో చురుగ్గా పనిచేసి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రధాన చోదకశక్తిగా ‘జన తెలంగాణ పార్టీ’ రూపుదిద్దుకుంటోంది.
మాజీ మావోయిస్టు నేత లంకా పాపిరెడ్డి (లచ్చన్న), అడ్వొకేట్ బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు అభ్యుదయవాదులు, పౌరహక్కుల ఉద్యమకారులు ఈ కొత్త పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ‘ఆపరేషన్ కగార్’ అనంతర పరిణామాల్లో బయటకు వచ్చిన దేవ్‌జీ-సంగ్రామ్ లేదా సోనూ-ఆశన్న వర్గాలు ఈ పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావడం లేదని స్పష్టమవుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి పార్టీ: రహస్య పోరాటాలను వీడి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త పార్టీ, రాబోయే వరంగల్-ఖమ్మం-నల్లగొండ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.
పార్టీ సిద్ధాంతాలు – లక్ష్యాలు: కేవలం భారీ ప్రాజెక్టులు, జీడీపీ గణాంకాలే అభివృద్ధి కాదని.. సామాన్యులకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు మరియు ప్రశ్నించే స్వేచ్ఛే అసలైన అభివృద్ధికి ప్రామాణికాలని పార్టీ నాయకులు తమ విధానపత్రంలో పొందుపరుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచినా ప్రజా సమస్యలు నెరవేరలేదన్న అభిప్రాయంతో ఉన్న ఈ బృందం, త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) పార్టీ నమోదు కోసం అధికారికంగా దరఖాస్తు చేయనుంది.

