తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. దసరా పండుగ రోజున 15 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లు సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దసరా రోజు బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలిని ఆమె గ్రామ సమీపంలో వదిలివెళ్లగా, ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. చెరియాల్ పట్టణం, ధూల్‌మిట్ట గ్రామానికి చెందిన నిందితులుగా గుర్తించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
